Rahul ram krishna: వైరల్ గా మారిన రాహుల్ రామకృష్ణ ట్వీట్..! 7 h ago
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ పై ఎంతో మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా లో పోలీసుల తీరును ప్రశ్నిస్తూ ట్వీట్ లు చేశారు. ఆ సమయంలో కమెడియన్ రాహుల్ రామకృష్ణ కూడా పోలీసులను ప్రశ్నిస్తూ ట్వీట్ చేసారు. తాజాగా సంధ్య థియేటర్ వద్ద ఏం జరిగిందో తెలుపుతూ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో రిలీజ్ తర్వాత రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అందులో "ఇటీవల జరిగిన ఘటన గురించి నా వద్ద సరియైన సమాచారం లేదు, ఈమేరకు ఆ రోజు నేను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్న" అని పేర్కొన్నారు. దీనికి ఓ నెటిజన్ స్పందిస్తూ "మీ తీరు చాలా బాగుంది అన్న... నిజం వైపు నిలబడటం అన్నిటికంటే ముఖ్యం. మీరు అందులో ముందుండటం గర్వం గా ఉంది" అని చెప్పగా... రాహుల్ ఆ కామెంట్ లైక్ చేస్తూ థాంక్స్ అని రిప్లై పెట్టారు.
రాహుల్ రామకృష్ణ మొదట ట్వీట్ లో ఏమన్నారంటే..
'సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటన దురదృష్టకరం. అది లా అండ్ ఆర్డర్ వైఫల్యం వల్ల జరిగింది కానీ ఒక్క వ్యక్తి చేసిన తప్పు ఎలా అవుతుంది?. పబ్లిక్ ప్రదేశాలకు సెలబ్రిటీలు హాజరయ్యేటప్పుడు పోలీసులు మరింత జాగ్రత్తగా ఉండాలి. సినిమా స్థాయిని గుర్తించి ముందస్తూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఎక్కువ మంది ప్రజలు వస్తారని తెలిసినప్పుడు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు?. అంతమందిని లోపలికి ఒకేసారి ఎందుకు అనుమతించారు? మతపరమైన ఊరేగింపులు, రాజకీయ పార్టీల మీటింగ్ ల సమయాల్లో జరిగే తొక్కిసలాటల్లోనూ కొన్నిసార్లు ప్రజలు మరణిస్తారు. అలాంటివాటికి ఇంతవేగంగా ఎందుకు స్పందించరు? సినిమా విషయంలో ఇంత వేగంగా ఎందుకు స్పందిస్తున్నారు. బాధిత కుటుంబానికి తగిన పరిహారం అందేలా చూడాలి. ఇలాంటి ఘటనల్లో ఒక్కరినే బాధ్యులను చేయడం సరికాదు' అని పేర్కొన్నారు.